సిద్ధాంతాలు వేరైనా వేదికొక్క‌టే..

30th March 2018 5:14am

ఎంత‌టి అరుదైన దృశ్య‌మిది. చాలామందికి అంటే నాలుగు ద‌శాబ్దాల క్రితం ఉష‌శ్రీ పేరు విన్న వారంద‌రికీ తెలుస్తుంది ఈ చిత్రం గొప్ప‌ద‌నం. ఈ చిత్రంలో హృద్యంగ‌మంగా మాట్లాడుకుంటున్న ఇద్ద‌రు వ్య‌క్తులు విభిన్న భావాల‌కూ, సిద్ధాంతాల‌కూ చెందిన వారు. ఎవరి అభిప్రాయాలు వారివి. అయినా ఒకే వేదిక మీద ఎంత చ‌క్క‌గా క‌బుర్లాడుకుంటున్నారో చూడండి. వీరిలో తెల్ల చొక్కా వేసుకున్న వ్య‌క్తి శ్రీ సి. రాఘ‌వాచారి గారు. విశాలాంధ్ర దిన ప‌త్రిక‌కు మూడు ద‌శాబ్దాల పైగా ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. కాషాయ దుస్తుల్లో ఉన్న‌ది ల‌క్ష్మ‌ణ య‌తీంద్రుల వారు. అయోధ్య‌లో బాబ్రీ మ‌సీదు కూల్చివేత‌లో ఈయ‌న కూడా పాల్గొన్నారు. ఇండియా టుడే దిన‌ప‌త్రిక ఆ స‌మ‌యంలో వీరావేశంతో ఉన్న య‌తీంద్రుల వారి ఫొటోను ముఖ‌చిత్రంగా ప్రచురించింది. రాఘ‌వాచారి గారు ఆస్తిక‌త్వం నుంచి నాస్తిక‌త్వానికి వ‌చ్చిన వారు. య‌తీంద్రుల వారు పూర్తి ఆస్తికులు. వీరిద్ద‌రికి ఉష‌శ్రీ గారు స్నేహితులు. ఇలాంటి వారు క‌లిస్తే వారి మ‌ధ్య వ్య‌ర్థ చ‌ర్చ‌లుండ‌వు. నిర్మాణాత్మ‌క‌మైన మాట‌లుంటాయి. వీరు క‌లిసిన ఘ‌ట్టం కూడా అపురూప‌మైన‌దే. ఉష‌శ్రీ‌గారు ప్ర‌వ‌చించిన భార‌తం ఆడియో క్యాసెట్ల ఆవిష్క‌ర‌ణ వేడుక‌. విజ‌య‌వాడ‌లో ఏర్పాటైంది. ఎన్ని స‌భ‌ల్లో పాల్గొన్నామ‌న్న‌ది కాదు ముఖ్యం ఎన్ని మంచి స‌భ‌ల‌కు ప్రాతినిధ్యం వ‌హించామ‌న్న‌ది ప్ర‌ధానం. విరుద్ధ భావాల వ్య‌క్తుల‌ను ఒకే వేదిక‌పైకి చేర్చిన ఆ శ‌క్తి ఉష‌శ్రీ‌ది. ఎక్క‌డ ఏం మాట్లాడాలో రాఘ‌వాచారి గారికి తెలుసు. ఎంత మాట్లాడాలో ఉష‌శ్రీ‌గారికి తెలుసు. అదే వారిద్ద‌రి స్నేహాన్ని బ‌లోపేతం చేసింది. రాఘ‌వాచారి గారు పురాణాల గురించి మాట్లాడ‌తారు. ఉష‌శ్రీ గారు క‌మ్యూనిజం గురించీ మాట్లాడ‌తారు. స్నేహం ప‌రిఢ‌విల్ల‌డానికి ఇంత‌కు మించి కావాల్సిందేముంది.

Also Read